Site icon Bhakthi TV

రామాయణంలో మానవుని అసత్‌ప్రవర్తనకు కారణంగా వాల్మీకి ఏం చెప్పారంటే..

మనిషి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలట. అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి. అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు. చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం. ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే. అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం. లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు. ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి. పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది. ప్రకృష్టమైన(విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది. మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-.. ‘పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’. ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!

Share this post with your friends
Exit mobile version