కలియుగ ప్రత్యక్షదైవం.. ఏడు కొండలవాడు.. భక్త వరదుడు వెలిసిన తిరుమల కొండ భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. తిరుమల కొండ సాక్షాత్తు వైకుంఠమని భక్తుల విశ్వాసం. కలియుగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూలోకంలో తిరుమల కొండపై అవతరించాడని చెబుతారు. ఆయనతో పాటు వైకుంఠం నుంచి ఎన్నో తీర్థాలు భూలోకానికి తరలి వచ్చాయని చెబుతారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న పుణ్య తీర్థాలుగా పేర్కొంటారు. శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులంతా పరిసర ప్రాంతాల్లోని తీర్థాలను సైతం దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అసలు తిరుమలలో ఎన్ని పవిత్ర తీర్థాలున్నాయి? వాటి గురించి తెలుసుకుందాం.
తిరుమలలో దివ్య తీర్థాల విషయానికి వస్తే మనం ముందుగా తెలుసుకోవల్సింది.. శ్రీవారి పుష్కరిణి. తిరుమలకు వెళ్లే భక్తులకు ఇది ఎక్కడుంటుందనేది బాగా తెలుసు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో.. వరాహస్వామి మందిరం వద్ద శ్రీవారి పుష్కరిణి ఉంటుంది. ఈ దివ్య తీర్థం గురించి బ్రహ్మండ పురాణం వివరిస్తోంది. వైకుంఠంలో విరజా నదియే విష్ణుమూర్తితో పాటు తిరుమలకు వచ్చిందని చెబుతోంది. అది కాస్తా శ్రీవారి పుష్కరిణిగా వెలిసిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. సాధారణంగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేసి అనంతరం స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం.
