Site icon Bhakthi TV

మహాభారతంలోని ఆదిపర్వంలో విభావనుడు, సుప్రదీపుడి కథ ఇది..

మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. ‘నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో..’ అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. ‘నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమ’ని తిరిగి అన్నను శపించాడు.

ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రు భావనలు ఉండిపోయాయి. తరచూ కలహించు కుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే.. ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు. ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే.. మనం నిత్యం మన ఇళ్ళల్లో చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు. కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు. చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది.

Share this post with your friends
Exit mobile version