
ఒక భూస్వామి పంట చేతికి వచ్చిన ఆనందంలో వేడుక చేసుకుంటున్నాడు. ఆ సమయానికే బుద్ధుడు భిక్ష కోసం అక్కడికి వచ్చాడు. భూస్వామి కోపంతో: “నువ్వు బలంగా ఉన్నావు, ఇలా బిచ్చమెత్తి తిరగడం కన్నా పని చేసుకుని తినడం గౌరవప్రదం కాదా? నేను నేలను దున్ని, విత్తనాలు నాటి శ్రమించాను, కాబట్టి గర్వంగా ఫలితాన్ని ఆస్వాదిస్తున్నాను. నువ్వూ పనిచేసి ఉంటే ఇలా అడగాల్సిన అవసరం ఉండేది కాదు!” అని ఈసడించుకున్నాడు. అప్పుడు బుద్ధుడి జవాబు ఏంటంటే.. ఆ కటువైన మాటలతో బుద్ధుడి ప్రశాంతతలో కదలికే రాలేదు. ఆయన నెమ్మదిగా “ఓ భూస్వామీ! నేను కూడా దున్నాను, నాటాను. అందుకే తింటున్నాను.” అన్నాడు.
రైతు ఆశ్చర్యపడి.. “నీ ఎడ్లు ఎక్కడ? విత్తనాలు, నాగలి ఎక్కడ?” అని అడిగాడు. బుద్ధుడు సౌమ్యంగా.. “విశ్వాసమే నా విత్తనం, సత్కార్యాలే వర్షం, వివేకం సచ్ఛీలతలే నా నాగలి. నా మనసే పగ్గం, చిత్తశుద్ధే నా ములుగర్ర, ప్రయాసలే నా ఎడ్లు. భ్రాంతులనే కలుపు మొక్కలను తొలగిస్తూ నేను దున్నిన చేలో పండే ఫలమే నిర్వాణం. అంటే సమస్త దుఃఖ నిర్మూలనం.”
ఈ మాటలు విన్న భూస్వామి కళ్ళు తెరిచినట్లయ్యాయి. తన ముందు ఉన్నది సాధారణుడు కాదని గ్రహించాడు. బంగారు గిన్నెలో పాయసం తెచ్చి: “అమరత్వపు పంటను పండించే గౌతముడు ఈ పాయసాన్ని స్వీకరించాలి” అని సమర్పించాడు.
మొదట పరాభవం ఎదురైనా, బుద్ధుడు చిరునవ్వుతోనే స్పందించాడు. అతని సౌమ్యత, తీయని పలుకులు ఆ కోపిష్టి రైతు హృదయాన్ని మార్చేశాయి. బుద్ధుడి జీవితమంతా ఇలాంటివే అనుభవాలు. ఆయన ఎప్పుడూ గొంతు ఎత్తలేదు, ఎప్పుడూ పిడికిలి బిగించలేదు. సహనం, కారుణ్యం, సౌజన్యమే ఆయన శక్తి. బుద్ధుడి బోధ ఏంటంటే.. సకల ప్రాణికోటికి ఆయన చూపినది సౌహార్దం.. ప్రతి హృదయాన్ని తాకింది ఆయన కారుణ్యం. ప్రపంచాన్ని దుర్మార్గమైందిగా కాక, అజ్ఞానమైందిగా పరిగణించాడు. అందుకే ఆయన మార్గం.. ప్రశాంతత, వివేకం, కారుణ్యం. ఆధ్యాత్మిక జీవితం కోరుకునేవారు బుద్ధుడి జీవితంలో ఎన్నో అమూల్యమైన బోధలు నేర్చుకోవచ్చు.
