Site icon Bhakthi TV

ఏ పని అయినా తొందరపడి చేయకూడదని చెప్పే మహర్షి కథ ఇది..

మేధాతిథి అనే మహర్షికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడు ఏ పనినైనా తొందరపడకుండా, బాగా ఆలోచించి ఆచరించే వాడు. ఆ కారణంగా అతనికి పెట్టిన పేరు “చిరకారి.” ఆశ్రమంలో తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తున్న చిరకారి జీవితం ప్రశాంతంగానే సాగుతుండేది. ఒకరోజు మేధాతిథి ఏదో కారణంగా కోపగించి భార్యను వధించమని తన కుమారుడిని ఆజ్ఞాపించి, ఇంటిని విడిచి వెళ్లిపోయాడు. చిరకారి తనలో తాను ఇలా ఆలోచించాడు: “తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం పాపం. కానీ తల్లిని హతమార్చడం మహా పాపం. నేను ఏమి చేయాలి?” ఆలోచిస్తూ తన మనసులో ధర్మవిచారణ ప్రారంభమైంది.

తండ్రి వంశోద్ధారణ కోసం పుత్రుడిని కంటాడు. కానీ ఈ శరీరం అంతా తల్లి నుండే వస్తుంది. ఆమె గర్భధారణలో పడే కష్టం, ప్రసవంలో పొందే వేదన అపారమైనది. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. పది మంది గురువుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడు. నూరు ఆచార్యుల కన్నా ఒక తండ్రి గొప్పవాడు.

వెయ్యి మంది తండ్రుల కన్నా ఒక తల్లి గౌరవంలో శ్రేష్ఠురాలు. అందుకే వేదం “మాతృ దేవోభవ” అని మొదటి దైవంగా తల్లిని స్తుతించింది. తల్లి లేని వాడు ఎప్పుడూ అశక్తుడు, దుఃఖితుడే. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎంతో సమయం గడిచిపోయింది.

ఆ సమయంలో కోపం తగ్గిన మేధాతిథి “నా కుమారుడు నిజంగానే ఆ ఆజ్ఞను అమలు చేసాడా?” అని భయంతో, కన్నీరు కారుస్తూ ఇంటికి చేరుకున్నాడు. కానీ అతనికి ఒక నమ్మకం ఉంది. “నా కుమారుడు ఆలోచించి మాత్రమే పని చేస్తాడు. తప్పు పనిని ఎప్పటికీ చేయడు.” అని. ఇంటికి వచ్చి చూసినప్పుడు భార్య సజీవంగా నిలబడి ఉంది. చిరకారి తండ్రి పాదాలకు నమస్కరించాడు. తల్లి కూడా ఆనందంతో కుమారుని ఆశీర్వదించింది. మేధాతిథి తన భార్యను కౌగిలించుకుని చిరకారిని ఆశీర్వదించాడు. అప్పుడతడు తన కుమారునికి “ఏ పనైనా తొందరపడి చేయకూడదు. బాగా ఆలోచించి, మంచి చెడు తూకం వేసి నిర్ణయం తీసుకోవడమే ఆర్యుని లక్షణం. అలాచేసే వాడు సార్థక జీవితాన్ని గడుపుతాడు. శాంతిని, సుఖాన్ని పొందుతాడు.” అని చెప్పాడు.

Share this post with your friends
Exit mobile version