Site icon Bhakthi TV

మాతృదేవోభవ అని ఎందుకంటారో తెలిపే కథ ఇది..

చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ . దాని పేరు బృందావన కాలనీ. ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొనాలన్నా రెండు ల్యాండ్ మార్కులు. ఒకటి కమలాసని నిలయం. రెండవది దీనదయాళ్ హాస్పిటల్. కమలాసని నిలయం అనేది నగసుత, హరికృష్ణ దంపతుల ఇల్లు. నగసుత సంగీత విద్వాంసురాలు. ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది. ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది. ఒక 8 ఏళ్ళ పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది. పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది. వాసుదేవ్ ఏకసంథాగ్రాహి. కమలాసని ఇంటి ముందునుండే దీనదయాళ్ ఆసుపత్రికి అంబులెన్సులు వెళ్తూ వుండేవి.

ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నా సరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి ‘నారాయణ నారాయణ’ అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు. క్లాసుకి అంతరాయం కలిగేది. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది. వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి టీచర్ అంటూ దణ్ణం పెట్టాడు. టీచర్‌కి జాలివేసింది. ‘నాయనా ! పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకలా చేస్తావు’ అన్నది కళ్ళు తుడుస్తూ. అప్పుడు వాసుదేవ్ ‘టీచర్ ! మా అమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి, ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని, మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్, అందుకే అలాచేశాను’ అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ. టీచర్ కళ్ళే కాదు, అక్కడి పిల్లలందరి కళ్ళూ వాళ్ళకి తెలియకుండానే వర్షించాయి.

అప్పుడు టీచర్.. ‘నేను కాదురా, నీవే నా గురువు’ అని అంటూ కౌగిలించుకున్నది. ‘టీచర్, నేను పెద్దయిన తరువాత హాస్పిటల్స్ కి అంబులెన్సు కొనిస్తాను. ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చెప్పింది. తథాస్తు అన్నది టీచర్ మనసులోనే. అలా 6 ఏళ్ళు గడిచాయి. సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్‌కి . అతని తండ్రిగారికి ట్రాన్స్‌ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కాలం గిర్రున తిరిగిపోయింది. ఒక రోజు పొద్దున ఓ పిల్లవాడి చేయి పట్టుకొని తెల్లని డ్రస్సులో హుందాగా ఉన్న వ్యక్తి కమలాసని ఇంటి గేటు తీసుకొని లోపలికొచ్చాడు . అమ్మా, ఎవరో వచ్చారు అని చెప్పింది ఇంట్లోని అమ్మాయి. అంతలో గురో అజగురో త్యాగరాజ గురో గురో అంటూ పాడటం మొదలుపెట్టాడు వచ్చినతను. వాసుదేవ్ ! నువ్వా అంటూ లోపలినుండి గబగబా పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్.

టీచర్ అంటూ ఆమె కాళ్ళకు ప్రణమిల్లాడు. అతడిని లేవనెత్తి ‘ఎలా ఉన్నావు వాసుదేవ్ ? ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు ? నన్ను మరచిపోయావా?’ అని అడిగింది టీచర్ . అతని కళ్ళవెంట కన్నీటిధారలు కారుతున్నాయి. ‘అమ్మా ! నేనిప్పుడు కార్డియాలజిస్టు . ఇక్కడే దీనదయాళ్ హాస్పిటల్‌కు డాక్టరుగా వచ్చాను. ఇప్పుడు నాకు అమ్మలేదు. తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని 10 అంబులెన్సులను హాస్పిటల్‌కు డొనేట్ చేశాను. నాకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను. వీడు నాకొడుకు దయాసాగర్. సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆ పసివాడిని ఆనందంగా ఆనందంగా టీచర్ దగ్గరకు తీసుకుంది. అందుకే మాతృదేవోభవ అన్నది వేదం. ఎంతవారికైనా తొలిగురువు అమ్మేకదా.

Share this post with your friends
Exit mobile version