ప్రస్తుతం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉన్న భీమ శంకరం క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కదా. దాని స్థల పురాణానికి సంబంధించి కొంతమేర కథ తెలుసుకున్నాం. ఇప్పుడు భీముడు అయితే దేవతలందరినీ హింసించడమే కాకుండా వారినందరినీ జయించి స్వర్గాన్ని సైతం ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవతలంతా శివుడిని శరణు వేడుకోగా.. భీముడిని సంహారించాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా భీముడిని తన దురాగతాలు ఇంతటితో ఆపేయమని హెచ్చరిస్తాడు. కానీ భీముడు తన వర గర్వం కారణంగా శివుడి మాటలను తలకెక్కించుకోడు. వరగర్వంతో శివునిపైకే దండయాత్రకు వచ్చాడు.
కొన్ని వేల సంవత్సరాల పాటు శివుడికి.. భీమునికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. భీముడు బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందినప్పటికీ, శివుడి ముందు అవేమీ పని చేయలేదు. దీంతో శివుడి చేతిలో భీముడు హతమయ్యాడు. భీముడి మరణంతో దేవతలంతా ఎంతగానో సంతోషించారు. ఆ తరువాత ఎక్కడైతే శివుడు.. భీముడిని సంహరించాడో ఆ ప్రదేశంలోనే ఉండిపొమ్మని దేవతలంతా ఆయనను ప్రార్థించారు. దేవతల కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని చెబుతారు. భీమ సంహారం చేసిన తరువాత అదే ప్రదేశంలోనే వెలసిన ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ శివుడు భీమ శంకరుడుగా పూజలందుకుంటున్నాడు.
