
ఈ సాలగ్రామాలు ఎలా పుడతాయి? ఎక్కడ దొరుకుతాయి? వంటి విషయాలన్నింటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సాలగ్రామాల పుట్టుక వెనుక పౌరాణిక కథ ఏంటనేది తెలుసుకుందాం. విష్ణుమూర్తి, సాలగ్రామం రూపాన్ని ధరించాడని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించి పురాణాల్లో చాలా కథలున్నాయి. అందులో ముఖ్యమైనది.. బృంద కథ. కాలనేమికి బృంద జన్మించింది. ఆమె జలంధరుడనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. రాక్షసుని భార్య అయినా కూడా బృంద చాలా సంస్కారవంతురాలు.. అలాగే మహాపతివ్రత. జలంధరుడు మాత్రం తన రాక్షస ప్రవృత్తిలో అందరినీ పీడిస్తుంటాడు.
ఈ జలంధరుడికి ఒక శాపం ఉంది. అదేంటంటే అతని భార్య అయిన బృంద పాతివ్రత్యానికి భంగం కలిగిన రోజున జలంధరుడు మరణిస్తాడు. ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగే అవకాశం లేదు.. తాను మరణించేది లేదన్న నమ్మకంతో జలంధరుడు మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకసారి జలంధరుడు ఏకంగా పార్వతీదేవిపైనే మొహం పెంచుకుని.. శివుని రూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళాడు. విషయం గమనించిన పార్వతీదేవి తీవ్ర ఆగ్రహంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించింది. పార్వతీదేవి చెప్పింది విన్నాక విష్ణుమూర్తి సైతం జలంధరుడిని సంహరించాలని భావిస్తాడు. జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళ్లి ఆమెను మోసగిస్తాడు. ఆ తరువాత తన నిజరూప దర్శనాన్ని ఆమెకు కల్పిస్తాడు. అప్పుడు ఆగ్రహంతో విష్ణుమూర్తిని శిలగా మారమని బృంద శపిస్తుంది. ఆ శాప ఫలితంగానే విష్ణుమూర్తి సాలగ్రామాల్లో నివసిస్తాడట. అయితే బృంద శిలగా మారింది. ఆ తులసి నుంచి వచ్చచే గాలి కారణంగానే సాలగ్రామాలు పవిత్రతను పొందుతాయని విష్ణుమూర్తి వరమిచ్చాడట. ఇది సాలగ్రామం కథ.
