Site icon Bhakthi TV

మధ్వాచార్యులవారు చందనాన్ని కరిగించగానే బయటపడ్డ శ్రీకృష్ణుడి విగ్రహం.. అంతా షాక్..

మధ్వాచార్యుల వారు మునిగిపోతుందనుకున్న నావను ఒడ్డుకు ఎలా చేర్చారో తెలుసుకున్నాం కదా.. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా మధ్వాచార్యుల వారిని స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, “స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి”, అని అనేక విధాల ప్రాథేయపడ్డాడు.

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ”నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా” అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు.

చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, “నువ్వే చూడు” అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్న వారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు.

Share this post with your friends
Exit mobile version