Site icon Bhakthi TV

భండాసుర సంహారం కోసం ఆదిపరాశక్తి ఎలా ఆవిర్భవించిందంటే..

భండాసురుడు వర గర్వంతో దేవతలను పీడించడంతో వారంతా బ్రహ్మ దేవుడికి తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవుడు వారందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. భండాసుర సంహారం మహాశక్తి కారణంగానే సంభవిస్తుందని విష్ణుమూర్తి తెలిపాడు. అప్పుడు దేవతలంతా త్రిమూర్తులతో కలిసి యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కో శక్తిని ధారపోశారు. విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని సమర్పించగా.. ఇంద్రుడు సైతం తన వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతలంతా వెంటనే ఆవిర్భవించి తమ కష్టాలను తీర్చాలంటూ పరాశక్తిని వేడుకున్నారు.

మొత్తానికి త్రిమూర్తులతో పాటు ఇంద్రుడు ఒక్కో శక్తిని సమర్పిస్తూ నిర్వహించిన యాగముతో జగన్మాత సంతోషించింది. ఆ యజ్ఞవేదిక నుంచి జగన్మాత పరాశక్తిగా ఆవిర్భవించిది. ఆ సమయంలో పరాశక్తి ఎలా ఉందో తెలుసుకుందాం. శిరస్సుపై రత్నకచితమైన స్వర్ణ కిరీటం ధరించి ఉంది. ఆ కిరీటం మీద అర్థచంద్రునితో అమ్మవారు ప్రకాశిస్తూ.. తన నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు విల్లు, ఐదు పుష్పబాణాలు ధరించి ఉంది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు సంతోషంతో అనేక స్తోత్రాలు చేశారు. దేవతల భక్తి భావానికి జగన్మాత ముగ్ధురాలైంది. అంతేకాకుండా భండాసురుని సంహరించి దేవతలను కాపాడుతానని అభయమిచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version