Site icon Bhakthi TV

భక్తితో హరినామాన్ని పట్టుకుంటే మోక్షం లభిస్తుందని చెప్పే కథ ఇది..

పూర్వకాలంలో ఖట్వాంగుడు అనే చక్రవర్తి సప్త ద్వీపాలను పరిపాలించేవాడు. శత్రువులు అతడి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడి పోయేటంత గొప్ప పరాక్రమవంతుడు. దేవతలకు.. దానవులకు జరుగుతున్న భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేకపోతున్నారు. వారిని నిలువరించాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇది గమనించిన ఇంద్రుడు ముఖ్యులతో ఆలోచించి అమిత పరాక్రమవంతుడు, యుద్ధంలో అరి వీర భయంకరుడు అయిన ఖట్వాంగుడిని సాయంగా రమ్మని అడిగితే బాగుంటుందని నిర్ణయించారు. స్వయంగా దేవేంద్రుడే వెళ్లి సహాయం అర్దించాడు. సరేనన్న ఖట్వాంగుడు దేవతల తరపున యుద్ధానికి వెళ్ళి దానవులను దొరికిన వాడిని దొరికినట్లు సంహరిస్తూ, మూకలను తుత్తునియలు చేసి తరిమి కొట్టాడు.

భక్తితో హరినామాన్ని పట్టుకుంటే మోక్షం లభిస్తుందని చెప్పే కథ ఇది..

అతని సాయానికి మెచ్చి దేవతలు ఏదైనా వరం కోరుకోమన్నారు. దానికి ఖట్వాంగుడు “మహాత్ములారా, నా ఆయుర్దాయం ఎంత? నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను” అని అడిగాడు. దానికి దేవతలు ‘ఇంకో ముహూర్తం కాలం మాత్రమే నీ ఆయుష్షు’ అని వివరించారు. ఇంకో ముహూర్తం కాలం మాత్రమే జీవితం మిగిలి ఉందని తెలుసుకున్న ఖట్వాంగుడు భూలోకం వచ్చి సంపదలు, రాజ్యం పుత్రులకు అప్పగించి, బంధు మిత్రుల బంధాలు వదలి, శ్రీమహావిష్ణువును మనసులో నిలిపి, ఏకాగ్రతతో ఆ ముహూర్త కాలం(40నిమిషాలు) శ్రీహరిని ధ్యానించాడు. అతడి సేవానిరతికి, ఎదుటి వారికి సహాయం చేసే ధర్మగుణానికి పరమాత్ముడికి కరుణ కలిగింది. ఖట్వాంగుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడు. భక్తితో హరినామాన్ని పట్టుకుంటే, స్వామి కటాక్షంతో మోక్షం పొందవచ్చును అనేది ఈ కథ ద్వారా అవగతమవుతోంది.

Share this post with your friends
Exit mobile version