ఆదిత్య హృదయం విశిష్టత గురించి తెలుసుకుందాం. నిత్య జీవితంలో మనం ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సక్రమంగా సాగాలన్నా, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా, అనారోగ్య సమస్యలుంటే అవి తొలగాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఆదిత్య హృదయాన్ని నిత్యం పారాయణం చేయాలట. సూర్యుడిని ముఖ్యంగా ఆరోగ్య ప్రదాతగా చెబుతారు. ఉదయం లేవగానే శుచిగా స్నానమాచరించి సూర్య నమస్కారం చేయాలి. అనంతరం ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మంచి జరుగుతుందట. శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని చెబుతారు.
ముఖ్యంగా ఆదివారం సూర్యోదయం సమయంలో స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చిన అనంతరం ఆదిత్య హృదయాన్ని పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయట. ఆదిత్య హృదయాన్ని 40 రోజుల పాటు ప్రతిరోజూ పఠిస్తే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందడంతో పాటు రోగ బాధలు, మృత్యు భయం తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా జాతకంలో సూర్య దోషం ఉన్నవారితో పాటు దారిద్ర్య బాధలను అనుభవిస్తున్నవారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల సత్ఫలితాలు పొందుతారట. వాల్మీకి రామాయణం ప్రకారం, ఈ స్తోత్రాన్ని నిత్యం మూడు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయట.
