సంఘీ దేవాలయం చరిత్ర తెలుసుకుందాం.. హైదరాబాద్‌కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘీనగర్‌లో పరమానంద గిరి అనే కొండపై సంఘీ దేవాలయం ఉంది. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన అందమైన ఆలయం. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉండేలా ఈ దేవాలయాన్ని రూపొందించారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు.
ఇది చోళ-చాళుక్య నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆలయ రాజగోపురం చాలా ఎత్తైనది. ఇది చాలా దూరం నుంచే కనిపిస్తుంది. ప్రధాన ఆలయంతో పాటు ఈ దేవాలయంలో మనం హనుమంతుడిని, రాములవారిని, విఘ్నాలకు అధిపతి అయిన గణేషుడిని, కార్తికేయుడిని, దుర్గ అమ్మవారిని మరియు అష్టలక్ష్మి వంటి ఇతర దేవతలకు కూడా ఇక్కడ చిన్న ఆలయాలు ఉన్నాయి .
ఈ ఆలయ సౌందర్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా ఇక్కడ అనేక దక్షిణ భారత చలనచిత్రాల షూటింగ్‌లు జరుగుతాయి. కొండపైన ఉండడం వల్ల ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయం నుండి పరిసరాల దృశ్యం చాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 1991లో సంఘీ కుటుంబం నిర్మించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ ఆలయం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, తిరిగి సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం రోజున ఉదయం 8:30 నుండి రాత్రి 8:00 వరకు నిరంతరాయంగా తెరిచి ఉంటుంది. మీరు కూడా తప్పక సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి.
