శ్రీశైల క్షేత్ర దర్శనంలో అత్యంత ప్రత్యేకమైనది శిఖరం. దాదాపుగా శ్రీశైలం వెళ్లిన వారంతా శిఖర దర్శనం చేసుకుంటారు. శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని.. జన్మ రాహిత్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక శ్రీశైలంలో మనం చూడాల్సిన ప్రదేశాల్లో పాలధార, పంచదార ఒకటి.
సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయ ఉంటుంది. ఆ ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు సైతం మనకు కనిపిస్తాయి.
అక్కడి కొండ పగుళ్ల నుంచి ఉరికి వచ్చే జలాలనే పంచదారగా పేర్కొంటారు. ఇక్కడి నీరు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉంటుంది. ఒక ధార నుంచి నీరు తాగిన మీదట.. మరో ధార నుంచి నీరు తాగితే రుచిలో తేడా స్పష్టంగా తెలుస్తుందని చెబుతారు. మల్లికార్జున స్వామి దేవస్థానానికి మూడు కిలో మీటర్ల దూరంలో హటకేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ పరమేశ్వరుడు అటిక అంటే ఉట్టి, కుండ పెంకులో వెలిశాడు. అందుకే ఇక్కడి స్వామివారికి అటికేశ్వరుడు అని పిలిచేవారు. కాలక్రమంలో అది హటికేశ్వరుడిగా మారిపోయింది.
