అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు ఎరుమేలి, పేటతుళ్లై గురించి వినకుండా ఉండరు. ఈ రెండింటి గురించి తెలుసు కానీ అర్థమైతే తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎరుమేలి అనే దానికి అర్థం తెలియకపోయి ఉండొచ్చు. “ఎరుమా” అంటే పశువు, “కొల్లి” అంటే చంపడం. అంటే ఎరుమేలి వచ్చిన భక్తుడు తనలోని పశురూప అజ్ఞానం, అహంకారాన్ని విడిచి వేయాలి. మనిషిలోని యవ్వనం, భోగం, అందం ఇవన్నీ తాత్కాలికం. భగవంతుడి నామమే నిత్యం. అయ్యప్ప భక్తులు “స్వామీ దింతక తోంతోం, అయ్యప్ప దింతక తోంతోం” అంటూ భక్తి పరవశంతో చేసే నృత్యమే పేటతుళ్లై.
అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో వేస్తారు. అది ఎందుకు వేస్తారో తెలుసా? శరీరమనే కొబ్బరికాయలోని ప్రాణాన్ని నెయ్యిగా స్వామివారికి అర్పించడం. ఇదే అభిషేకం అంతరార్థం. తరువాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం ద్వారా సంపూర్ణ సమర్పణ సూచన.
భగవదానుగ్రహం కలిగించే మూడు నియమాలు..
ఆహార నియమం – దీక్ష సమయంలో తినవలసిన, తినకూడని ఆహారం.
ఆచార నియమం – దీక్ష సమయంలో చేయవలసిన, చేయకూడని పనులు.
విహార నియమం – దీక్ష సమయంలో స్నానాలు, దేవాలయ దర్శనం, సత్పురుష బోధనం, సత్సంగతులు.
ఈ మూడు నియమాలు పాటించిన వారికి దైవానుగ్రహం తప్పక కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

