ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి జరిగే రెండు రకాల భస్మ హారతి గురించి తెలుసుకున్నాం కదా. ఈ మహాకాళేశ్వరుడి భస్మ హారతి వీక్షించిన వారికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుందట. అదేంటంటే.. సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడిని దర్శించిన అనుభూతి కలుగుతుందట. ఈ అనుభూతిని ఎవరైనా చెబితే మనకు అర్థం కాదట. ఎవరికి వారు ప్రత్యేక్షంగా అనుభవించి తెలుసుకోవాలట. బ్రహ్మ దేవుడు సైతం శివుడికి ఈ భస్మ పూజ చేశాడని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని మహా శ్మశానమని కూడా పిలవడం జరుగుతోందని కొన్ని పురాణ గాథలు చెబుతున్నాయి.
తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణంలో పవిత్ర మంత్రోచ్ఛారణ, గంభీరమైన వాయిద్య ధ్వనుల నడుమ ఈ భస్మ హారతి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో గర్భగుడి మొత్తం శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుందని చెబుతారు. దీనిని భస్మ హారతిలో పాల్గొన్న భక్తులు జీవిత కాలంలో మరిచిపోలేరట. అంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మహాకాళేశ్వరుడి భస్మ హారతిని పేర్కొంటారు. అయితే ఈ భస్మ హారతిలో 10 మంది నాగ సాధువులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మహిళలకు పాల్గొనేందుకే కాదు.. చూసేందుకు సైతం అనుమతి ఉండదు. భస్మ హారతి సమయంలో గర్భగుడిలోకి ఎవరికీ అనుమతి ఉండదు.
