శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 పవిత్ర మెట్లను ‘పదునెట్టాంబడి’ అని పిలుస్తారు. ఈ మెట్లను అధిరోహించడం భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ 18 మెట్లు భక్తుడు ప్రాపంచిక జీవితం నుండి ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకునే ప్రయాణంలో దాటవలసిన వివిధ దశలను సూచిస్తాయి. మొదటి 5 మెట్లు ఇవి పంచేంద్రియాలకు ప్రతీకలు. తర్వాతి 8 మెట్లు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంబం వంటి అష్టరాగాలకు సంకేతాలు. తర్వాతి 3 మెట్లు సత్వం, రాజసం, తామసం వంటి త్రిగుణాలను సూచిస్తాయి. చివరి 2 మెట్లు జ్ఞానం, అజ్ఞానం లకు ప్రతీకలు.
మరొక పురాణ గాథ ప్రకారం, అయ్యప్ప స్వామి దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 దివ్యాస్త్రాలకు ఈ మెట్లు ప్రతీకలు. స్వామి వారు సన్నిధానంలో కొలువైయ్యే ముందు, ఆ ఆయుధాలను ఇక్కడ విడిచిపెట్టారని చెబుతారు. ఈ మెట్లు శబరిమల చుట్టూ ఉన్న 18 పవిత్ర కొండలను లేదా 18 అధిష్ఠాన దేవతలను కూడా సూచిస్తాయని నమ్మకం. 41 రోజుల పాటు కఠిన మండల దీక్ష పాటించి, ‘ఇరుముడి’ ధరించిన భక్తులను మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది ఒక సాధారణ ప్రక్రియ కాదు, భక్తుడు తనలోని చెడు గుణాలను వదిలిపెట్టి, ఆత్మశుద్ధి పొంది, భగవంతుని సన్నిధికి చేరుకునే ఒక పవిత్రమైన యోగమార్గం.
