Site icon Bhakthi TV

అర్జనుడిని గుడాకేశ అని ఎందుకు అంటారో తెలుసా?

తగిన ఆహారవిహారాలు, తగిన చేతలు, తగిన (నియమితమైన) నిద్ర మెలకువలు కలిగిన యోగులు దుఃఖాలను పోగొట్టుకుంటారు. అతినిద్ర వలన చురుకుతనం తగ్గి, జ్ఞానం, కర్మాచరణ వంటివి కొనసాగవు. ఏ పనిచేసినా సమర్థవంతంగా, సాఫల్యంగా చేయలేడు. భరతునితో శ్రీరాముడు మాట్లాడుతూ… “ఎక్కువగా నిద్రించడం లేదు కదా! అలాగని తక్కువగా నిద్రపోవడం లేదు కదా సరియైన నిర్ణయాలను, ఆలోచనలను తెల్లవారుజాముననే ఆచరిస్తున్నావు కదా” అని ప్రశ్నిస్తాడు. భరతుడు కౌసల్య ముందు ప్రతిజ్ఞ చేస్తూ.. “అమ్మా! నా వల్లనే శ్రీరాముడు అడవికి వెళ్ళినట్లయితే – ఉభయసంధ్యలలో నిద్రించేవాడు పోయే పాపానికి పోతాను” అంటాడు♪.

ఇలాంటి మాటలన్నీ సదాచారంలో ‘తగిననిద్ర’ ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. “నిద్ర, అతివాగుడు – మాపై పెత్తనం చలాయించకూడదు” – అని వేదంలోనే ఒక మంత్రం ఉంది. ధర్మాచరణలో సెలవులు ఉండవు. ప్రతిదినం, ప్రతిక్షణం చాలా విలువైనది.‌ భగవంతుడు ఇచ్చిన ఆయువును ధర్మాచరణతో, సాధనతో సార్థకం చేసుకోవాలి. అందుకే నిద్రను జయించాలి. శ్రీకృష్ణుడు, అర్జునుని “గుడాకేశ” అని సంబోధిస్తాడు. ‘గుడాకేశ” అర్జునునికి భారతంలో మరో పేరు. ఈ పదానికి “నిద్రను జయించినవాడు” అని అర్థం. అందుకే అతడు ‘విజయుడు’ అయ్యాడు’. గీతాబోధనకు అర్హుడయ్యాడు. తమోగుణం ఎక్కువైనవారికి నిద్ర, కునుకుపాటు ఎక్కువగా ఉంటాయి. వారికి ఐశ్వర్యం, జ్ఞానం కలగవు. నిద్ర, తంద్ర (కునుకుపాటు), భయం, క్రోధం, సోమరితనం, వాయిదాలు వేయడం – ఈ లక్షణాలున్నవాడు జీవితంలో ఎదగలేడట.

Share this post with your friends
Exit mobile version