ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో విద్యార్థుల దినచర్య ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా అమలవుతోంది. ఉదయం సంధ్యావందనం, అగ్నికార్యం నుంచి ప్రారంభమై పఠనం, బోధన, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానంలో కొనసాగుతోంది.
పండితులను ఆకర్షిస్తున్న వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు:
వేద, శాస్త్ర, ఆగమ జ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న పండితులను ఆకర్షిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను సత్కరించడం ఈ సదస్సు ప్రత్యేకత. ఇటీవల మార్చి 8 నుండి 13 వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. టీటీడీ ఆధ్వర్యంలో ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలు విజయవంతంగా నడుస్తున్నాయి. “వేదాలకు పుట్టినిల్లు తిరుమల” అనే మహోన్నత భావాన్ని సార్థకం చేస్తూ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే దివ్య విద్యా కేంద్రంగా నిలుస్తోంది.
