Site icon Bhakthi TV

వైభవంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయాలని యోచించారు. అయితే దానికి 125 కిలోల బంగారం అవసరపడింది. దీనికోసం కొంత విరాళాలుగా, భక్తులు హుండీలో సమర్పించిన కానుకలతో పాటు ప్రభుత్వం స్వచ్ఛమైన బంగారంతో దివ్య విమాన గోపురాన్ని తాపడం చేయించింది. ఈ బంగారు విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆవిష్కరించారు.

ఈ క్రమంలోనే ఆలయంలో జరిగిన దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక మహోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు మహా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశ్వీరాదం ఇచ్చారు. ఐదు రోజులుగా మహా కుంభాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. హోమ గుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసి ప్రతిష్టించారు. అనంతరం 108 మంది రుత్వికులు యజుర్వేదాలు ఆలపించారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాగాలు జరిగాయి. ఉదయం సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version