
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారమే శ్రీ కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. మరి శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎందుకు ధరించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ పౌర్ణమిని కూర్మ జయంతిగా పేర్కొంటారు. అంటే ఇవాళే (మే 12). గర్వంతో ఓసారి దేవేంద్రుడు.. దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తించాడట. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడికి తన పట్ల దేవేంద్రుడు అనుచితంగా ప్రవర్తించడంతో విపరీతమైన కోపం వచ్చింది. దీంతో దేవతలంతా శక్తిహీనులవుతారని శపించాడు. నాటి నుంచి దేవతలంతా శక్తిహీనులయ్యారట.
చివరకు దానవుల చేతిలో సైతం ఓటమి పాలయ్యారు. దేవతలంతా వెళ్లి శ్రీ మహా విష్ణువుకు మొరపెట్టుకున్నారు. దీంతో విష్ణుమూర్తి ఔషధాలకు నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని దేవతలకు చెప్పాడట. అప్పుడు దేవతలు తమ కన్నా బలవంతులుగా ఉన్న రాక్షసులతో అమృతాన్ని చెరి సగం చేసుకునేలా సంధి చేసుకుని క్షీర సాగర మథనానికి ఒప్పించారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టారు. కానీ మంధర పర్వతం బరువు ఎక్కువగా ఉండటంతో సముద్రంలో మునగనారంభించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా వీపుపై మోశాడు.
