Site icon Bhakthi TV

లలితా పంచమి ఎప్పుడు? ఎలా జరుపుకోవాలి?

దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఐదో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజును లలితా పంచమిగా మనం జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి నవరాత్రుల్లో ఐదవ రోజును మనం అమ్మవారిని శ్రీ లలితాదేవిగా అలంకరించి పూజించుకుంటాం. ఇంతకీ మనం ఎప్పుడు లలితా పంచమిని జరుపుకోనున్నాం? ఎలా పూజను నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్ 27న అంటే శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి రానుంది. ఈ రోజును మనం లలితా పంచమిగా జరుపుకోనున్నాం.

నవరాత్రి తొమ్మిది రోజులు ఒక ఎత్తైతే ఐదో రోజు ఒక ఎత్తుగా భావిస్తారు. ఆ రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సైతం లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున మహిళలంతా సుమంగళి పూజ చేస్తారు. లలితా దేవి ‘త్రిపురత్రయం’ లో రెండో శక్తి స్వరూపిణి అని వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం చెబుతోంది. అందుకే లలితా దేవికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమిని ‘లలితా పంచమి’గా కూడా భావిస్తారు. లలితా త్రిపుర సుందరి దేవి చేతిలో చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి దర్శనమిస్తుంది.

Share this post with your friends
Exit mobile version