
ఉత్తరాదికి, దక్షిణాదికి పూజల విషయంలో కొంత మార్పైతే ఉంటుంది. దక్షిణాదిలో ఇంకా ఆషాడమే నడుస్తోంది కానీ ఉత్తరాదిలో అయితే మొన్న పౌర్ణమి నుంచే శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసిన ఆధ్మాత్మిక శోభ అలరారుతూ ఉంటుంది. అయితే తాజాగా దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్లో అక్కడి ముఖ్యమంత్రి ఆపరేషన్ కాలనేమిని ప్రారంభించారు. అది ఎందుకు ప్రారంభించారు? ఏమిటన్న విషయాన్ని చర్చిస్తూనే.. ప్రతి హిందువు కాలనేమి ఏంటి? ఎక్కడో విన్నట్టుందే అనే చర్చ కూడా మొదలు పెట్టేశారు. రామాయణంలో కాలనేమి ప్రస్తావన ఉంటుంది. ముందుగా ఆపరేషన్ కాలనేమి ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం.
ఎక్కడైనా సరే.. భక్తులు ఎక్కువగా ఉన్నారంటే.. అక్కడ మోసాలకు పాల్పడే బురిడీ బాబాలు కూడా ఎక్కువగానే తయారవుతూ ఉంటారు. రకరకాల వ్యక్తులు సాధువులుగా వేషం వేసుకుని భక్తులను మోసం చేసేందుకు సిద్ధమవుతారు. ఈ నేపధ్యంలో దొంగ సాధువుల ఆగడాలను అరికట్టించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. దొంగ సాధువులు ఉంటారు జాగ్రత్త అంటూ భక్తులను సైతం అప్రమత్తం చేస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ నెల 11న ఈ ప్రాచారాన్ని ప్రారంభించారు. దీనికే ఆపరేషన్ కాలనేమి అని నామకరణం చేశారు. దీనిలో భాగంగా మోసం చేసే వ్యక్తులను పట్టుకుంటారు. ఈ క్రమంలోనే కాలనేమిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
