Site icon Bhakthi TV

స్వామివారి తపస్సుకి మెచ్చిన లక్ష్మీదేవి ఏం చేసిందంటే..

తిరుమల శ్రీనివాసునికి నిర్వహించినట్టే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సైతం ప్రతి ఏటా కార్తీక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమై డిసెంబర్ 6 వరకూ జరగనున్నాయి. అసలు పద్మావతీ అమ్మవారికి కార్తీకమాసంలో నే ఎందుకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు? అసలు బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటో తెలుసుకుందాం.శ్రీ పద్మావతి అమ్మవారు కార్తిక మాసంలో శుక్లపక్షం, పంచమి తిథి, శుక్రవారం ఉత్తారాషాఢ నక్షత్రంలో జన్మించారు. అమ్మవారి జన్మనక్షత్రం ఆధారంగానే కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మొదటిసారిగా ఈ ఉత్సవాలను బ్రహ్మదేవుడు నిర్వహించారట. కాబట్టి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. స్కంద పురాణంలోని వేంకటాచల మహత్యంలో ఈ బ్రహ్మోత్సవాల గురించి వ్యాస మహర్షి వివరించారు. వైకుంఠంలో భృగుమహర్షి శ్రీ మహాలక్ష్మి దేవి స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తన్నడం వలన, కోపంతో లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళిందని మనకు తెలిసిందే. అప్పుడు లక్ష్మీ వియోగంతో స్వామివారు ఖిన్నుడయ్యాడట. దీంతో స్వామివారు భూలోకానికి వచ్చి తపస్సు చేశాడట. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారి తపస్సుకి ప్రసన్నురాలైందట. ఆ తరువాత స్వర్ణముఖి నది తీరాన తిరుచానూరు పద్మసరోవరంలో కార్తిక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూల దండలతో స్వామి వారిని వరించింది. అలా లక్ష్మీ దేవియే పద్మములో పద్మావతిగా జన్మించినదని పురాణాలు చెబుతున్నాయి.

Share this post with your friends
Exit mobile version