Site icon Bhakthi TV

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయ విశేషాలేంటంటే..

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. ఈ గుడిలో శక్తికి, అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక బోనాల పండుగ రెండు రోజులు ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. లష్కర్‌ బోనాలుగా పిలవబడే ఈ సికింద్రాబాద్ జాతరను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

ఉజ్జయిని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ఆయనను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ మొక్కుకున్నారంట.

తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే ఆ అమ్మవారు కరుణ వల్ల కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి కూడా తగ్గుముఖం పట్టింది. అంతట అమ్మవారి కరుణ వల్లనే ఇదంతా జరిగిందని విశ్వసించిన సురటి అప్పయ్య, ఆయన మిత్రులు 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చి, ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు.

Share this post with your friends
Exit mobile version