Site icon Bhakthi TV

శని బాధలతో ఇబ్బందులు పడేవారు చేయాల్సిన పరిహారాలేంటంటే..

ఈ శ్రావణ శనివారానికి ఎన్ని ప్రత్యేకతలున్నాయో తెలుసుకున్నాం కదా. జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్న వారు, శని మహర్దశ నడుస్తున్నవారు, ఇంకా శని అధిపతి అయిన మకర, కుంభ రాశుల వారు ఈ రోజున పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందని తెలుసుకున్నాం. మరి వీరంతా ఎలాంటి పరిహారాలు చేయాలి? ముందుగా అవి తెలుసుకుందాం. శ్రావణ శనివారం రోజు గోమాతను పసుపు కుంకుమలతో పూజించాలి. అనంతరం పశువులకు గ్రాసం తినిపిస్తే ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయట. చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది.

అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది.. కాబట్టి కొన్ని ముఖ్యమైన రోజుల్లో అన్నదానం చేస్తే ఫలితం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. శ్రావణ శనివారం రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. ఆలయంలోని పూజారికి నవధాన్యాలను దానం చేయాల్సి ఉంటుంది. అలాగే పవిత్ర నదుల్లో స్నానమాచరించినా ఫలితం బాగుంటుంది. రావి చెట్టుకు దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఇనుప పాత్రలో నువ్వుల నూనెను పోసి దానమిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే రుణ బాధలు, శత్రు భయాలు తొలగిపోతాయి.

Share this post with your friends
Exit mobile version