
అమెరికాలోని డల్లాస్ నగరంలో అగ్రరాజ్యంలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ మెక్కినీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు.. ఆర్పీ పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన హనుమాన్ చాలీసాను విడుదల చేశారు. 16వ శతాబ్దంలో శ్రీ గోస్వామి తులసీదాసు అవధి భాషలో హనుమాన్ చాలీసాను రచించారు. ఇప్పుడు దానిని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఆయా భాషలవారు చదువుకుంటూ పాడుకునేలా వీడియోను ఆర్పీ పట్నాయక్ రూపొందించారు.
హనుమాన్ చాలీసాను ఇలా భారత్‌లోని కొన్ని ప్రాంతీయ భాషల్లో అనువదించడం పట్ల హనుమాన్ భక్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుని అపార శక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి కలగడం ఖాయమని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు విని పట్నాయక్‌ను అభినందించారు. ఇది నేటి యువతకు బాగా చేరువవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ ఫౌండర్ శ్రీ ప్రకాష్ రావు కూడా పాల్గొన్నారు.
