Site icon Bhakthi TV

వెంగమాంబ రచనలో దేవుడు ఎక్కడుంటాడో తెలుస్తుందట..

ధ్యానం చేసేవారికన్నా ధాన్యం తయారు చేసే వారే గొప్పవారని కడప యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు నల్లపరెడ్డి ఈశ్వర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో ఆదివారం జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 10 గం. సాహితీ సదస్సు జరిగింది. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నృసింహ శతకం వైశిష్ట్యంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనల్లో నీతి, భక్తి, నైతిక విలువలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. ప్రతి మనిషిలో దయ, శక్తి, నిజం మాట్లాడే స్వభావం ఉంటే, దేవుడు ఎక్కడో లేరని, అందరిలో కనిపిస్తారని, కనిపించే భౌతిక రూపంలో దేవుడు కనిపిస్తారనే భావన వెంగమాంబ రచనల్లో కనిపిస్తుందన్నారు.

మనసు పవిత్రంగా ఉండేలా చూసుకోవాలని, మనిషిలో భగవంతుడిని చూసుకోవాలనే భావన నృసింహ శతకంలో కనిపిస్తుందన్నారు. ఈ శతకంలోని 103 పద్యాలలో కీ.శే శ్రీ కే జే కృష్ణ మూర్తి గారు 93 పరిష్కారం చూపగా 10 పద్యాలు మిగిలిపోయాయన్నారు. వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా. వి. కృష్ణవేణి మాట్లాడుతూ, తిరుమలలో జీవ సమాధి కేవలం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారికే ఉందన్నారు. తరిగొండ వెంగమాంబ తాత్విక చింతన అనే అంశంపై మాట్లాడారు. వెంగమాంబ రాసిన చెంచు నాటకంలో స్త్రీ పాత్రనే ప్రధానపాత్ర పోషించే కథానాయికగా తీర్చిదిద్దారన్నారు. ఎన్నో అవమానీయ సంఘటనలు ఎదురైనా ఎక్కడా రాజీపడకుండా భక్తి మార్గాన్నే అనుసరించారన్నారు. స్త్రీ గా ఆమెకు ఎన్నో ఆటంకాలు, సమస్యలను సృష్టించినా ఆమె భయపడకుండా తపస్సు చేసి రచనలు చేశారన్నారు.

Share this post with your friends
Exit mobile version