
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం సూచించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 06 – 15వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో రాజీలేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి ముందస్తుగా అనుమతులు తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శ్రీసీతారాముల కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలన్నారు. మరింతగా ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. త్వరలో కడప జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కల్యాణ వేదిక వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు, జిల్లా పోలీసులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర చర్యలు చేపట్టాలని కోరారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు, కల్యాణ వేదిక వద్ద, ఆలయ సమీపంలో భజన బృందాలచే ఆకట్టుకునేలా సాంస్క్రతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచే మార్గాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదాలు, అగ్నిమాపక శాఖ, వైద్య, ఆరోగ్యం, భద్రతా, ఎలక్ట్రికల్, ఫ్లవర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, రవాణా, ఐటీ, శ్రీవారి ఆలయం, తదితర శాఖల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కేవలం 45 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందస్తుగా చెక్ లిస్ట్ పెట్టుకుని, అందుకు అనుగుణంగా మార్చి నెల చివరి నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
06.04.2025 – వృషభ లగ్నంలో ఉదయం 9.30 – 10.15 గంటల మధ్య ధ్వజారోహణం, సాయంత్రం 7 గంటలకు శేష వాహనం
07-04-2025 వేణుగాన అలంకారం హంస వాహనం
08-04-2025 వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
09-04-2025 నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
11-04-2025 శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రాత్రి 8.30 గంటలకు), గజవాహనం.
12.-04-2025 రథోత్సవం
13-04-2025 కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రాత్రి 7 గంటలకు)
15-04-2025 ——– పుష్పయాగం(సాయంత్రం 6 గంటలకు).
