Site icon Bhakthi TV

శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎన్ఆర్ఐలతో టీటీడీ సమావేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్ఆర్ఐ నిపుణులతో వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు స్వచ్ఛందంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పలు రాష్ట్రాల నుంచి శ్రీ మలయప్ప స్వామివారి సేవకులు తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.

టీటీడీలోని వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని ,తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ , ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్ఆర్ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టీటీడీలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు .వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్‌ఆర్ఐలు.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ముందుకు రావడంపై ఈ అవకాశం తమకు స్వామివారు కల్పించిన మహద్భాగ్యం అని హర్షం వ్యక్తం చేశారు.

Share this post with your friends
Exit mobile version