Site icon Bhakthi TV

బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు..

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్‌తో పాటు వాహన సేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఈడీ)లు ఏర్పాటు చేశారు.

ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version