Site icon Bhakthi TV

ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 06 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈ క్రమంలోనే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. టీటీడీ అధికారులు, కడప జిల్లా కలెక్టర్ , ఎస్పీలతో కలసి ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక ప్రాంతాలను శనివారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మార్చి చివరి నాటికి ఆలయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, కల్యాణ వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. కడప జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాలపై ప్రచార రథాల ద్వారా కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన పట్టణాలతోపాటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ ప్రకారం పూర్తి చేయాలని , భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్, తదితర శాఖ అధికారులను ఆదేశించారు.

Share this post with your friends
Exit mobile version