Site icon Bhakthi TV

సింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాల సమర్పణ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి(అప్పన్న) తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిన్న వేకువజామునే వైభవంగా ప్రారంభమైంది.

సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version