
దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక్కడి మానసాదేవి ఆలయంలో నేడు (ఆదివారం) తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మానసాదేవి మందిరానికి వెళ్లే మెట్ల మార్గంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో పెను ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శ్రావణమాసం ఆరంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే మెట్ల మార్గంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన ఆలయానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హరిద్వార్‌కు శివుని భక్తులు కన్వర్ యాత్ర నిమిత్తం హరిద్వార్‌కు వస్తుంటారు. ఇక్కడి మానసాదేవిని దర్శించుకున్న మీదట గంగానది నుంచి పవిత్ర జలాన్ని కావిళ్లతో మోసుకెళుతూ ఉంటారు. శ్రావణమాసమంతా ఈ కన్వర్ యాత్రను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడకు వచ్చారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు.
