
వీకెండ్లో ఎటైనా వెళ్లాలని భావించేవారు చాలా మందే ఉంటారు. వారి కోసం ఐఆర్సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అదేంటి? దాని పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. దీనికి గోదావరి టెంపుల్ టూర్‌గా పేర్కొంది. ఈ ప్యాకేజీలో భాగంగా రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్రతి శుక్రవారం రాత్రి 08:30 గంటలకు లింగంపల్లి నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్‌లోనూ పికప్ పాయింట్ ఉంది. ఈ రైలు శనివారం ఉదయం 04:38 గంటలకు రాజమండ్రి స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి 80 కి.మీ దూరంలో ఉన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకొంటారు.
సాయంత్రం రాజమండ్రి వెళ్లి గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని చూపిస్తారు. రాత్రికి అక్కడే బస. 03వ రోజు ఆదివారం హోటల్లో చెక్ అవుట్ చేసి అంతర్వేది వెళ్లి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుని బీచ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత శ్రీ బాల బాలాజీ ఆలయం, అప్పనపల్లి, విఘ్నేశ్వర ఆలయం, అయినవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షారామం ఆలయ దర్శనం చేసుకుంటారు. అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు. సోమవారం ఉదయం సికింద్రాబాద్‌కు 04:35 గంటలకు, లింగంపల్లికి 05:55 గంటలకు చేరుకుంటారు.
ఈ టూర్ ప్యాకేజ్ టికెట్ ధరల విషయానికి వస్తే.. ప్రతి వ్యక్తికి కంఫర్ట్ (3AC)లో సింగిల్ షేరింగ్ అయితే రూ.15340, ట్విన్ షేరింగ్ రూ.8940, ట్రిపుల్ షేరింగ్ రూ.7170, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్ బెడ్ రూ.6080, విత్అవుట్ బెడ్ రూ.4960గా ఉంది. అలాగే స్లీపర్ క్లాస్ అయితే సింగిల్ షేరింగ్ రూ.13800, ట్విన్ షేరింగ్ రూ.7400, ట్రిపుల్ షేరింగ్ రూ.5630, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్, విత్ అవుట్ బెడ్ రూ.4540, రూ.3420గా ఫిక్స్ చేసారు. ఒకవేళ 4 నుంచి ఆరుగురు ప్రయాణికులుంటే మాత్రం ఈ ప్యాకేజీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్యాకేజీ టారిఫ్ తగ్గుతుంది. ఇందులో ప్రతి వ్యక్తికి కంఫర్ట్ (3AC)లో ట్విన్ షేరింగ్ రూ. 7440, ట్రిపుల్ షేరింగ్ రూ. 6630, 5-11 సంవత్సరాలు పిల్లలకు ఏమి మారలేదు. అలాగే స్టాండర్డ్ (SL)లో ట్విన్ షేరింగ్ రూ. 5900, ట్రిపుల్ షేరింగ్ రూ. 5630, 5-11 సంవత్సరాలు పిల్లలకు అదే టారిఫ్ ఉంది.
