Site icon Bhakthi TV

అత్యంత వైభవంగా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు

చందన స్వరూపుడిగా…ఏడు వారాలు ఏడు ప్రదక్షిణల వెంకన్నగా భక్తులు పిలుచుకునే వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలను ఆలయ అధికారులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈ దివ్య కళ్యాణ మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించి ఆనందపరవశులవుతున్నారు.

స్వామివారి కల్యాణ మహోత్సవాలకు తొలిరోజు అంకురార్పణ జరగగా.. రెండవ రోజు రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై రథాన్ని లాగారు. రథం లాగుతున్నంతసేపు వాడపల్లి గోవింద నామస్మరనతో మారుమోగింది. అనంతరం రాత్రి స్వామివారి దివ్య కల్యాణం జరిగింది. దీనికి కూడా రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి, అమ్మవార్లను ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయంతో పాటు కల్యాణ వేదికను పుష్పాలు, పండ్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు భక్తులను కట్టిపడేశాయి.

Share this post with your friends
Exit mobile version