Site icon Bhakthi TV

కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానరసేన శ్రీకారం

సీతారాముల కల్యాణోత్సవాన్ని దేశం మొత్తం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. దక్షిణ అయోధ్యగా భద్రాచలం పేరుగాంచింది. ఇక్కడ సీతారాముల కల్యాణానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇక ఇక్కడ స్వామివారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు చాలా ముఖ్యం. స్వామివారి కల్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను వినియోగిస్తూ ఉంటారు. దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఆ ధాన్యాన్ని చేతులతో వలిచి మరీ స్వామివారికి తలంబ్రాలను తయారు చేశారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో రామాయణంలోని కొందరు ముఖ్యుల వేషధారణతో పొలం దున్ని.. వరి విత్తనాలను నాటారు. తాజాగా వరి పొలాల్లో కోటి తలంబ్రాలు పంట కోసం శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగధుడు దుక్కి దున్ని ధాన్యం చల్లారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. 15 ఏళ్లుగా జరుగుతోంది. రాములవారి కల్యాణానికి కోటి తలంబ్రాల కోసం ఎకరం 60 సెంట్లలలో ధాన్యం పండించడం ఆనవాయితీ. ప్రతి ఏటా అక్కడి వారు శ్రీరాముడు, ఆంజనేయడు సహా ముఖ్యుల వేషాలను ధరిస్తారు.ఈ వేషధారణతోనే వరి విత్తనాలు చల్లి, ఊడ్పు ఊడ్చి పంట చేతికొచ్చాక కోత కోస్తారు. అనంతరం ఈ ధాన్యాన్ని గోటితో వలిచి భద్రాద్రి రామయ్య ఆలయానికి అందజేస్తారు.

Share this post with your friends
Exit mobile version