
పురాణాల ప్రకారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించారట. రామానుజాచార్యుని శిష్యుడిగా అనంతాళ్వారును పేర్కొంటారు. రామానుజాచార్యుని అభిమతానుసారమే అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్టు మనం తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతాళ్వారు పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టాక ఒకరోజు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తున్నాడట.
అప్పుడు బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై గర్భిణి అయిన అనంతాళ్వారు వద్దంటున్నా ఆయన భార్యకు ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడు. అది కాస్తా అనంతాళ్వారుకు విపరీతమైన కోపం తెప్పించింది. ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు ఆలయానికి వెళ్లి చూడగా.. స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుంచి రక్తస్రావం అవుతోందట. అది చూసిన అనంతాళ్వారుకు బాలుని రూపంలో వచ్చింది శ్రీ మలయప్ప స్వామివారేనని అర్థమైంది. తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు. నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.
