Site icon Bhakthi TV

హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున వాహన సేవలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ వాహన సేవలకు హాజరై అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తున్నారు. రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీ కోదండరామస్వామి నాలుగో రోజు బుధవారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నారు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు.

Share this post with your friends
Exit mobile version