Site icon Bhakthi TV

చందప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి వారి క‌టాక్షం

తిరుపతిలో కొలువైన శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. రెండ‌వ రోజైన గురువారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను క‌టాక్షించారు.

భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశం, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version