Site icon Bhakthi TV

పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఉదయం కంకణ బట్టర్ శ్రీ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు.

గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శేష వాహ‌పంపై స్వామివారిని దర్శించే భక్తుల్ని కాపాడుతానని, భక్తులు శేషుని వలే తనకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version