
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానం నేపథ్యంంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, విజిలెన్స్, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్లను అందుబాటులో ఉంచారు.
చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్టమైన భద్రత నిర్వహించారు. గ్యాలరీలలోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమంచారు. ఇక భక్తులు శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌలభ్యం కోసం అవసరమైన సమాచారం అందించేందుకు పుష్కరిణి సమీపంలోని రథం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి. కాబట్టి ఈ రోజంతా భక్తులు పవిత్ర స్నానమాచరించనున్నారు.
