
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ తెప్పోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం గోవిందరాజ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు. తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా మంగళవారం కూడా శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేశారు.
ఇక చివరి రోజైన బుధవారం.. తెప్పోత్సవంలో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
