Site icon Bhakthi TV

ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.

ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం :

ఈ సందర్భంగా ఈవో శ్రీ జె. శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ, గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.

Share this post with your friends
Exit mobile version