Site icon Bhakthi TV

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం, సాయంత్రం వాహన సేవలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారి వివిధ వాహన సేవలను తిలకించారు. శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.

అంతకు ముందు పెద్ద ఎత్తున పంచమి తీర్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై పద్మ పుష్కరిణిలో స్నానమాచరించి తరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లనూ నిర్వహించింది. శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల విశేషాలను తిలకించేలా ఎక్కడికక్కడ టీటీడీ ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను నిర్వహించారు. భక్తులకు 5వ తేదీ రాత్రి నుంచి అన్నప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, కాఫీ, కదంబం , చెక్కెర పొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, వెజిటబుల్ ఉప్మా పంపిణీ చేశారు.

Share this post with your friends
Exit mobile version