Site icon Bhakthi TV

సిరిమానోత్సవానికి చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు

ఉత్తరాంధ్రలో అతి పెద్ద పండుగగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సిరిమానోత్సవం కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 15న సిరిమానోత్సవం జరగనుంది. 14వ తేదీన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. నిపుణులయిన వడ్రంగులు అరవై అడుగుల పొడువున్న చింతచెట్టును సిరిమానుగా మలుస్తున్నారు.

మరోవైపు సిరిమాను రథం పనులు సైతం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి కోసం ప్రతీ ఏటా సుమారు అరవై అడుగుల పొడవైన సిరిమానును తయారు చేస్తారు. సిరిమానుపై అధిష్టించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అమ్మవారు కటాక్షిస్తుంది. ఇదే సిరిమానోత్సవం. ముందుగా అమ్మవారు ప్రధాన అర్చకుడు బంటుపల్లి వెంకట్రావు కలలో అమ్మవారు కనిపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తన సిరిమాను కోసం కావల్సిన ఎత్తైన చింత చెట్టు ఎక్కడ ఉందో తెలియజేస్తుందట. అనంతరం అధికారులతో కలిసి ఆయన చింతచెట్టును గుర్తించి విజయనగరానికి తరలించి సిరిమానుగా మలుస్తారు. ఈ ఏడాదైతే విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ గ్రామంలో చింతచెట్టును గుర్తించి 60 అడుగుల సిరిమానును తయారు చేస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version