Site icon Bhakthi TV

శ్రీశైలంలో రెండో రోజు బృంగి వాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు

శ్రీశైలంలో బ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయమంతా విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లుగొలుపుతోంది. రెండవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి బృంగివాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపానికి తీసుకొచ్చారు. అనంతరం బృంగివాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.

అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలించారు. రాజగోపురం ద్వారా బృంగివాహనాదీశులైన స్వామి అమ్మవార్లను బాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను కనులారా దర్శించుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు అధికారులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version