
ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్‌లో ఒకే చోట అన్నమయ్య సంకీర్తనలు సనాతన ధర్మాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు తయారు చేయాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో హెచ్‌డీపీపీ, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎపిక్ స్టడీస్, తదితర ప్రాజెక్ట్ అధికారులతో గురువారం టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, భగవద్గీత సారాంశాన్ని పిల్లలు, యువతకు అర్థవంతంగా, సరళంగా ఉండేలా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భగవద్గీతలోని ముఖ్యమైన ఘట్టాలను సరళతరంగా, సులంభగా ఉండేలా కార్టూన్, వీడియోల రూపంలో అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. హిందూ ధర్మం విశిష్టత, ధార్మిక, ఆధ్యాత్మిక,మానవీయత, నైతిక విలువల గురించి యువతకు తెలియజెప్పేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా ధార్మిక కార్యక్రమాలను తయారు చేయాలని సూచించారు. విద్యార్థులలో దైవభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబవ్యవస్థ తదితర అంశాలపై యువతకు శిక్షణ ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు.
భజన మందిరాలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి అయ్యాయి, చివరి దశలో ఎన్ని ఉన్నాయో సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ద్వారా ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని మరింత నాణ్యంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా ఇప్పటి నుంచే సంబంధిత ప్రతినిధులతో మాట్లాడాలని కోరారు. పచ్చదనాన్ని మరింత పెంచేలా శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరిగి వెళ్లే భక్తుల ద్వారా గ్రీనరీని ప్రోత్సహించే విధంగా ‘శ్రీవారి వన నిధి’ ద్వారా ఒక మొక్కను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.
