Site icon Bhakthi TV

గరుడ వాహనంపై శ్రీవారి అభ‌యం.. నేడు పార్వేట ఉత్సవం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి కటాక్షించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ జరిగింది. రాత్రి 7 గంటల నుండి గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభ‌యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాక్షాత్కార వైభవోత్సవాలు ముగిసిన మరుసటి రోజైన జూలై 13న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.

Share this post with your friends
Exit mobile version