Site icon Bhakthi TV

సూర్య, చంద్రప్రభ వాహనాలపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడి కటాక్షం

జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు శ్రీమహా విష్ణువు అలంకారంలో సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అనంతరం మంగళవారం రాత్రి స్వామివారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version